Monday, March 28, 2016

My poems telugu

కాలని నేను.....
నడుము లేని మనుషులం
.....................................

1.
కనిపించే తెల్లని మబ్బుల వెనుక
వివరించలేని యన్నో వేదనలు
నల్లగా మారి యెప్పుడు వర్షిస్తాయో
కన్నీటి చినుకులను....
2.
నను నేను నియంత్రించుకోలేని
అనుమోదిత హింసలో
వేల జీవకణాల మృత్యువు
పరిపాలిస్తుంటే
బైర్లు కమ్మిన చేతనత
విప్పలేని ముడుల్లో చిక్కుకొని
ప్రాణాలు తోడేస్తుంటుంది
3.
దోసిలి పట్టి అక్షరాలుగా మార్చేస్తూ
ప్రదర్శనల్లో యెకిలి నవ్వులూ చిందిస్తుంటే
 చేతులూ ముందుకు వేసి, కదిలించి
వుదయం కోసం యెదురు చూసే వారు
కొందరే వెలుగుల కోసం
4.
యే సౌందర్యమో తీరని తృష్ణగా
మనుషుల మనతనాన్ని వెతుక్కొంటూ
వెళ్ళమంటుంటే నేనేమో
 కనిపించని దాని ఆచూకీతో అలసి
మూర్చిల్లుతుంటే
వో పసి నవ్వు  స్పృహను వెన్ను తడుతుంది.
5.
నడుము కట్టాలని, బిగించాలని
ముఖం నిండా రంగిల్లేనితనంతో
కలవరపు లోగిళ్ళలో తడారని
కష్టాల ఆనవాళ్ళను గుర్తుపట్టిందెవరో
మొదటి అందాకర్షణా లాటి
జీవిత బాట కోసం ఆనందించిందెవరో

6.
 యే తేపురానీ ఖాళీ కడుపుల పులకింతలు
యింకా మిగిలే వున్నాయి
నేను నన్నుగా చెప్పుకోలేని
పారవశ్యాలూ శేషాలైయున్నాయి
7.
పొద్దుపొడిచే దాకే నేను మనిషిని
పొద్దేక్కెకొద్ది యెన్ని వేషాల్లో
 ప్రవేశించాలో యెన్ని కొమ్మలు
నరకాలో యెందరి వెన్నపూసలూ
విరియాలో....యెన్ని రోజులూ
యిలా .....

వెంటాడే....
నైట్ మేర్...మియర్ మేల్..
---------------------------------

కళ్ళను పొత్తంపై ఆన్చాను
 కల కరిగీ కరిగీ...

నీలమెరుపులోకీ వొంకీలూ జుమ్కీలు
మధ్యలో మధ్యలో
నల్లని హేర్పిన్ స్ట్రోక్లూ కనిపించి కనిపించగా
అంతలోనే తెలుపూ పసుపులా గుభాళింపులూ వీటి మధ్యమ
వో ముదురు పచ్చతో నలుపు కలసి
వెంటాడే మార్మిక క్షణాల్లా ...

తీరా అవి స్తంభించినపుడు యేర్పడే
వో అమూర్త వర్ణ చిత్రం ముందు
నేను స్థగితుణ్ణై...

యే రంగు యెప్పుడెందుకు
 యేర్పడుతుందో తెలీని
వో వెర్రితనపు
స్వప్న లోకంలో....

నను
పైకి లేపే గాలి వర్ణంలోకి మారడం చూద్దామని....
పొయ్యి ముట్టించమని చెప్పి వెళ్ళిన
భర్త గింజలతో యెప్పుడు తిరిగొస్తాడో
ఆమె ఆకలి యెదురుచూపుల వర్ణ మెలాంటిదో  కనాలని...
కన్నీటికి దోసిళ్ళకీ మధ్యలో వుండే వర్ణ
వ్యవధిని తిలకిద్దామని...
చచ్చాక కనిపించే వారు బతికుండగా
వారు మాట్లాడని మాట రంగు యెలా
వుంటుందో ...

.నేను నన్ను
యెంత ముంచుకుందామనుకున్నా
యీ రంగుల్లో
యీ రంగులను తాకాలనుకొంటున్నా
నా నలవి కాక భళ్ళున పగిలీ
ముక్కలై పోతున్నానేమిటీ
నైట్ మేర్
కాదు కాదు

నా కళ్ళు మళ్ళీ
తెరుచుకోనవసరంలేని
అవకాశం కోసం యెదురు చూస్తూ చూస్తూ.....

(ఆర్టిస్టు Akbar Mohammad చిత్రాల్లోని యెగోనీ చూసాకా చాలా రోజులు నాలో నలిగాకా)

మాఁ...అమ్మా...నేనెందుకూ
------------------------------------

Oh! My mother
Why should I born on this eath?
1.
మౌనంగా
నిశ్శబ్దంగా
నా కోసమ్
యీ పురిటి నొప్పులను
పంటికింద అదిమి పట్టి
యెందుకు భరిస్తున్నావు
నన్నెందుకు
యీ ప్రపంచంలోకి తీసుకొస్తున్నావు
2.
యీ యిరుకైన మనుషుల మధ్య
కుల మతాల అహంకారాల మధ్య
ధనామోహంతో
స్వార్థంతో
రాజ్యాధికారం కోసమ్
యెంతకైన తెగిస్తూ
బతుకులను
మరింత బర్బరీకరిస్తున్న
తరుణంలో
మానవత్వమ్ అర్థాన్ని కోల్పుతున్నప్పుడు
మేరీ మాఁ  ప్యారీ మాఁ
నన్నెందుకు పుట్టిస్తున్నావు
3.
మనుషులను వ్యాపారంగా చూస్తూ
నయం కాని వ్యాధులకు కారణమౌతూ
ప్రశ్నిస్తే నగ్నంగా నిలబెట్టే యీ
అనాగరిక సమాజమ్ లో
తడిలేని మనుషుల మధ్య
నన్నెందుకు తీసుకొస్తున్నావు
4.
వొక చోటేమో అర్థాయుష్షులూ
మరో చోటోమో నిండు నూరెళ్ళూ
తెల్లవాడని నల్లవాడనే వ్యత్యాసాలు
అగ్రవర్ణమ్ నిమ్నవర్ణమ్
మనుషుల్ని మనుషుల్లా చూడలేని
యీ అసంపూర్ణ అర్థరహిత లోకంలో
సమానత్వం అర్థాన్ని కోల్పోతున్న
నేపధ్యంలో
Why should I born mom
My dear mom
5.
యీ జీవన్మరణాల మధ్య
Being is nothingness
Meaningless
నా పుట్టుక
నా బాధ నీ బాధగా మారి
నీ కన్నీరు నా కళ్ళల్లో కారుతుంటే

నీనేను...నానువ్వు....
..............................
1.
నేను వో రాత్రిలో
 పొగనై బతికుంటాను...
వో మార్మిక దృశ్యం నాలో
యేదో వో వాణిగా స్పష్టమౌతోంది
2.
చస్తున్నప్పుడు ప్రేమించమంటాడు
చావు తరువాత ప్రేమింపబడాలంటాడు
ప్రేమంటే తెలీనోడు...ప్రేమే వుంటే
ప్రేమించడం నేర్పిస్తే చాలు కదా..
3.
ప్రతి క్షణంలో మమేకమయ్యే
మరో క్షణపు దృష్టానుభవం
యిలా పయనిస్తుంది...
వుదయాన్నే గంభీరంగా మేల్కొంటున్న
మెత్తని ప్రకృతి కదలికలను
 పేరు తెలియక పోయిన
కూచే పక్షుల కూతల ఫ్యూజన్ ను
చాలీ చాలని వేడితో వుందయిచే వెలుగులు
చలికాలపు రాతిరి మన నగ్న దేహంపై
వర్షిస్తున్న మంచు శీతలతల స్పర్శ
4.
మృత్యువు తరువాత పసిపిల్లల
నవ్వులను తీసుకొని
మన ప్రేమలను
వొదిలి వెళ్ళిపోదామా...
మనకు వ్యాపారమంటే యిష్టం
అందుకే వొకటి యిచ్చి వొకటి తీసుకు వెళ్తున్నాం
పసిపిల్లలు యేమీ ఆశీంచరు
వారికి భయంలేదు
నవ్వడమే తెలుసు
నిండుగా...
ప్రేమించడం ...
5.
ఆకులు రాలిపోతుంటే
సెలవుల కోసం వెళ్ళి
ఆరాము చేస్తుంటాను
చెట్లతో పాటు...
6.
కాగితాల లోనే మనుషులను
చూసాడు
వస్తువినియోగమే సుఖం
దుఖపు రుచితెలీక
భయంతో
సంపాదించిన
ప్రాణంలేనితనాన్ని
నెమరేస్తూనే వుంటాడు
7.
నవ్వి యెన్నిరోజులైందో
అరచేతి స్పర్శకు దూరమై
చాలాకాలమే అయినట్టుందీ
చాలానే దాచుకుంటున్నాం
లో లోపల
యెప్పుడు
భళ్ళున పేలుతుందో...
యెప్పుడు
యీ సంరచనలన్నీ
పేక మేడలై కూలునో.

ప్రాణాన్ని నింపే క్షణాలు
.................................
మా యింటికీ
రోజూ వచ్చే అతిధులు

పిచ్చుకలు
జీవ దాహంతో
ఆకలితో వాలును
మా గుండెలపై
మా సంక్షోభాల్ని
వాయిదా వేస్తాయి

వుదయాన మేల్కొల్పును
మమ్ము
తమ కువకువలతో...
ఆలస్యమైన అరపులాంటి
పిలుపు
యింటిపై నుంటే
చుట్టూ మూగును
యెగిరి గంతులేయును
అటుయిటు

మధ్యహ్నాన వేళ
యింట్లోకీ ప్రవేశించును
మా పరధ్యానాన్ని
బద్దలు చేయును

సాయంత్రం వీడ్కోలు
చెప్పేందుకొచ్చి
మాటల్లో పడి మరచిన
కిటికీ పై కూర్చొని
పలకరించును

తమ ఆతిధ్యాన్ని
స్వీకరించి చిత్తగించును
సంధ్యతో పాటు
వాటి కువకువల
రూప లావణ్యపు స్వేచ్చా
ధారణతో మేమూ నిద్రలొకి
జారుకొంటాం

సూర్యోదయపు
కువకువల ప్రతీక్షను
రెప్పలపై వుంచుకొని
మేమంతా పిచ్చుకలై
యెగురుతుంటాం
యిష్టమొచ్చినట్టు...
స్వప్నమై

కళ్లు తెరిచే సరికీ
మా పడకలపై
మాతో పాటు
కళ్ళు తెరుస్తూ...
పిచ్చుకలూ
కువకువలూ
వుదయాన్నే
దినదినమూనూ


కనని కలల స్వప్న ద్రవాలూ
-----------------------------------
1
యెన్ని దృశ్యాలో
 యెన్ని స్వప్నపు ద్వారాలో
నిద్దుర పోకు స్వప్నం కోసం
వేల దర్శిత నేత్రాలకు వొకే దృశ్యం
మన ముందు నిలిచి వుండును
అది స్వప్నమై..
2.
యెగిరే పక్షి గూటికే వెళుతోంది
తన పిల్లల కోసం
తన నోట్లో నాలుగు గింజల్ని నాన బెట్టుకొని వెళ్తూ కన్పించే దృశ్యమూ
స్వప్నమే
3.
వాలిపోతూ మన నెత్తిన
 క్షణానికొక్కటి చొప్పున
  యెన్నో అందమైన వర్ణ సంధ్యల్ని
  విశాల కాన్వాసు మీదా
దినదినమూ గీసిస్తూనే వుంటాడూ
అతను...
4
ఆ క్షణపు తదేక లేఖనపు
వో వర్ణము నేనై పోవడమూ
స్వప్నమే కదా
5.
రోజూ పలకరించే తొలికిరణమూ
వొళ్ళు విరిచే ఆకులూ
అరిచే గువ్వలూ
పిలిచినట్టుండే కీటకాల ధ్వనుల్లోనూ
విన్పించే వో లయాత్మకతా
వుదయపు
నిశబ్దం శబ్దానికి మధ్యలోని
నిడివి
స్వప్నం కాదా...
6.
నీ భుజం మీదీ
నీ మెడ చుట్టూ గట్టిగా పట్టుకొని
గుండెలకు హత్తుకునే
వో పసినవ్వులోకి నిన్ను నీవు
అనువదించుకోవడం
స్వప్నమే కదా ..
7.
తేటగా తెల్లగా
మంచుబిందువు కింది
తలమూ కన్పించినట్టు
మనం మరొకరికీ
మరొకరు మనకు
అర్థమవడం
స్వప్నం కాదా....
8.
యిలా
వొకే దృశ్యంలో
 క్షణక్షణమూ
వేల స్వప్నాలు
మెలకువలో
కువకువలాడుతూ.....

నా ముడులూ
నీ యేడ్పులూ
-------------------
1.
నేను నీకూ
వో భూమ్యాంతర వాసినీ
నువ్వు నాకు
ఆత్మాంతరవాసివీ
2.
యీవ్వాళ...
వో గోరు మొలవక...
నా యెముక మాట్టాడలేక
నా జుట్టు తలెత్తలేక
రంగుల్లేని...
యే వర్ణాలో చెప్పలేని
చిత్రంలో నేనూ...
3.
యెన్ని దండనలు
మరిన్ని కఫములు
మూట కట్టుకుంటున్న పీడనలు
4.
యిక్కడ యెప్పుడో
వో వుదయం అందంగా వుండేది
యిప్పుడేమో నిస్సత్తువగా  సాయం ముందే చీకటినీ కమ్మేస్తోందీ
5.
లోపల్నుంచి తోడుకోలేక
తమ ఆకుల్ల్ని రాల్చుకొంటున్నారూ
మళ్ళీ మొలవలేమనే తెలీసీ
పారంపరిక దుఖాన్ని దాటి
నిర్మొహమాటంగా కాలు
 యించుకుంటూ యీడ్చుకుంటూ
బరువునూ తేలికగా భ్రమపడ్తూ
6.
నిన్న నేను మోసిన పడవ
నిన్ను తెలివివంతుణ్ణి చేసింది
యీరోజు
చుక్కల్లో నుంచి
రాలుతున్న కన్నీటితో
నిండిపోతుంటాడు
ప్రతి పున్నమికి చంద్రుడు
యెన్ని సంవత్సరాలు గడిచిన
యీ నియతి బతికే వుంది
7.
శోకమూ సుఖమూ
వేరై మళ్ళీ కలిసే
పాయల నామలవణ
వచనములూ
తప్తతన్మయత
పలుకుల మధురిమలను
ముద్దాడాలనే చివరి శ్వాసగా
8.
నను నేను
చూడలేని క్షణాల నుంచి
రాలే నల్లని చీకటీ చినుకులలో
వూపిరాడక...
యే వుదయమూ
వుదయించదా అందంగా
నన్ను నేను చూసుకునేందుకూ

చలిగా చలించని ప్రాణాలు
----------------------------------
వుత్తరాన
వో పేదోడి యింట్లో
ప్రవేశించిన చలి పాము
అప్పుడే పుట్టిన శిశువును
కాటేస్తోంది
నిర్ధయగా దినదినమూ...

చలి
మరో పేదోడి జీవికను
కొన్ని గంటలూ
వాయిదా వేస్తూ
స్థంభింపజేస్తూ
అరకడుపులో
అర్థాకలిని నింపుతోందీ
కృపారహితంగా
దినదినమూ

చలీ
మరోసారీ
నానమ్మలను,అమ్మమ్మలను
తాతయ్యలను
తన వేధింపులతో
వివశితులను చేసీ
ఆత్మహత్యకు పురికొల్పుతోంది...
కర్కశంగా
దినదినమూ....

చలి
అస్పష్ట దృశ్యమై
రోడ్డుపై దుర్ఘటనగా మారి
పాదాచారుల
అతి సామాన్యుల
ప్రాణాలపై కూర్చోని
రక్తమై ప్రవహిస్తోంది
అమానవీయంగా
దినదినమూ....

చలి
వున్నోడి యింట్లో
హీటర్గా,పొయ్యిలోని
మంటై మండి
వెచ్చగా మారిపోతోందీ
సురక్షితంగా
దినదినమూ

యిలా వుంటే
కవులేమో
చలికాలపు అందాలతో
మంచుగా మారి
కాగితాల్లో
కమ్ముకుంటున్నారు
వెచ్చగా
దినదినమూ

నేనేమో
వుత్తర యాత్రలోభాగమై
 పసిశిశువును
కాలేకపోతున్నందుకు
విపరీతంగా
చింతిస్తూ
హీనస్గా చస్తూ...

 విరిగిన వెన్నముకలో ఆగనిస్వరాలు
----------------------------------------------
1.
యెవరూ
యీ మూడో ముఖాన్ని
యిలానే శిల్పించినది
తలలేని ముక్కుతో
కన్నులేని నోటితో
వొకటేమో స్వప్నభగ్నత
మరొకటేమో నగ్నమరీచిక
దిగులంతా మూడో ముఖమే
చెవుల్లేని చర్మంతో...
డు నాట్ క్లాప్ విత్ మీ
2.
భళ్ళున తెరవలేని లోచనాల లోపల
నానబెట్టలేని మృత్యువు నెత్తిన
నింపాదిగా మరోవృక్షపు వేర్లు
పైకెందుకో స్వాగతిస్తూ
సంచయ రసాసక్తిలో కుంగిపోతున్న
వో మూలగది నాకెప్పుడూ యెరుకే
వొళ్ళంతా చిక్కులతోనే విప్పలేని
వో మరణ రహస్యం
మృత్యువు మెత్తగా దిగిపోయే
వో మర్మాంగ నిశాభవనమీ గది
డు నాట్ హర్ట్ విత్ దిస్
3.
 నేను విసర్జించలేని వెనుకటి రోతలో
అసహ్యించుకోలేని మరెన్నో పూతలు వున్న
మేల్కొల్పి విసిగిపోయిన
వొక మరణపు ముక్కదొరకక
అలసిన అనుగుణపు వుయ్యాలలో
ప్రాణమూగే ప్రాణశూన్యంలో ....
డు హేట్
4.
సాపాడుకూ అల్లాడే వో పసిపాద గాయం
యెప్పడూ నన్ను చీల్చే చూపై నిలబడినపుడు
యెటూ చూడలేనీ నేను
మళ్ళీ మళ్ళీ
ఆ మూడో మృత్యువే వేటాడును
నాలో నిత్యం
అదే స్వప్నమై
డు నాట్ పే అటెన్షన్...
డు నాట్ తింక్ ...
5.
యింతేనా
యేదో అనుకొని
యింకేదో తలచి
నీ వెనుకే పరుగెత్తితీ
ఛీ....యీ పలవరింత
పలకరింపులా కూడా లేదే
అంతకాక మరేమీ
యీ మృత్యుజనమృత్తిక
డు నాట్ లవ్ దిస్
కిక్ దిస్ విత్ ఫుట్

కన్పించక మరణించాక
------------------------------

1.
వొక కిటికికీ యెన్ని వూచలున్న
లోపలుండే చీకట్లోంచి
కన్నులు మూసుకు పోతుంటే
తలలు వాల్చేస్తుంటే
మదిలోని వెలుగు దీపమై
కళ్లల్లో మెరుస్తుంటే...
నేనూ
యెనిమిదో వూచనై
యెదురు చూస్తుండగానే
బయట తిరిగే యీ కాంతిలో
యెన్ని వర్ణాలూ వొక్కటై
కన్పిస్తాయో తేటగా
యీ చీకట్లోంచి
2.
వో వుదయాన
నాలుగు చీమలు
 రెండు ఆకులముక్కలను
వీపున వేసుకొని
తూర్పు నుంచి పడమరగా
బయలుదేరాయి
సాయంత్రం లోగా
తమ పుట్టల్లోకి చేరుకుందామని
అక్కడకు చేరే సరికి
మరో వుదయం మొలుస్తోంది
తమ ఆహారగారాల్లో
నిక్షిప్తంగానే వున్నాయీ అన్నీ
3.
వో
దృశ్యమైన చూపు
మళ్లీ తిరిగి వస్తుందని
పోగొట్టుకున్న చోట లేదని
అది అడవిలోనే వుందని
కళ్లు పోగొట్టుకున్నాకే
అర్థమౌతుంటుంది....
4.
చెట్టుకు వేర్లిచ్చిన అడవి
యెండకు గొడుగుపట్టమని
ఆకాశాన్ని అడిగిన అడవి
చీమల్ల్ని మాత్రమే
యెందుకు తన గర్భంలో
పదే పదే దాచుకుంటుందో
చీకట్లో వెలుగుల కోసమా
పగలూ చీకటిగానే వుందనా
5.
కాగితాలూ కాలిపోతున్నాయి
దేహాలూ దేహాల్లాగే
మిగిలిపోతున్నాయి
అందరూ అందరై
కరగలేక శిలలై
మరలై మిగిలి పోతున్నారూ
తడి కరగి ప్రవహించి
యెన్ని రోజులైందో
నగర వీధుల్లో
కలుపు తీసిన నాట్లు కుళ్ళిపోతుంటే
----------------------------------------------
మన చుట్టు వున్న వారిలో
మనలో
రుతు గమనాన్ని గుర్తించాలి
మనలోన జీవిపు చెట్టు నుంచి
రాలి పోయే సమస్త ఆకులను
కిటికీల్లో వుంచలేం
పచ్చదనాన్ని మొలకెత్తించిన
అక్షరాలను
లిఖించుకుంటున్న
ప్రేమైక్య క్షణాలను
మనలో రాల్చేసిన చినుకులను
వొడిసి పట్టుకొని
మన దాహాల్ని తీర్చేస్తున్న
జీవితాల గమనానుగమాలను
కాపాడుకోలేక పోతుంటే

మనం కనీస గడ్డిపువ్వు కూడా
కాలేక చప్పట్లుకొడుతూ
నిస్పందనగా నీడ కూడ
కాలేక దోచుకోబడ్డ ఫలితాల
జారే కాలపు తలంపై
నిలబడాలని చేసే ప్రయత్నాలన్నీ
ఐ తింక్ సో
మృత్యు భారాన్ని నివాళిలోకి
అనువదింప బడుతుంది
తేలిగ్గా...

జీవించేందుకు చస్తున్నప్పుడు
చలించిపోని కంపనాల
ఆభాస చిరునామా నిలిచి
వుంటుంది ...నదిలేని తిలంపై
కోల్పోవడమే తెలీని
వస్తు నాకుడుకు
నిజమే తెలుసు
అది మింగడం
యేర్గడం మాత్రమే
యెక్కువైతే కక్కేయడం

జీవింపలేని
కరగలేని
నేను
జీవితమంటే
ప్రేమా కాదు
పరువుకాదు
కాగితాల్ల్ని నింపేయడమూ కాదు
పోగుచేసుకోవడమూ కాదు
లోపలి లోతుల్లో సైతం
అద్దమై ప్రతిబింబించడం
నలుపును
తెలుపును
కలుపుకోవడం
యెరుపై వుదయించడం
వాడి కోశపు శోకం
 నా ప్రాణం తీసి పోసి
.............................
1.
దూరాలెప్పుడు పిలుస్తుంటాయా
ప్రయాణానికి సిద్దమవ్వమని
భువనభేధ్యాలై కన్పించేవి
గువ్వల కూతలైనంత చేరువగానే
వున్నట్టు...వున్న
2.
చెంతలో వున్నవి
వో వింతగాలేని కొత్తగానూ లేనీ
అపరిచితములు పరిచితములుగావూ
అన్నీనూ మన చుట్టే వున్నట్టూ
వున్నవన్నీ వేటిచుట్టూ
తిరగలేక కదలనూ లేక
యేమైపోతున్నాయో
కన్పించినట్టే మాయమైపోతూ
వాటి స్థానంలో యేమీలేనీ
వొక ముభావమూ అభావమూ
3.
యే చినుకు యెందుకు కురువాలో
యే వేరు యెందుకు గ్రహించుకుంటుందో
వూరే నీటీ చెలమలూ
యెన్నింటికీ ప్రాణం పోస్తున్నయో
 కురవని వర్షపు చినుకూ
కన్నీరుగానూ,స్వేదంగానూ
రాలేనీతనపు ఘర్షణానంతరం
నిస్సహాయ తాళ్ళు పేనిన
చలించని అడవి
చూస్తూనే వుంది ప్రాణమ్
పోయడమే ఆఖరి లక్ష్యంగా
4.
వాడొక్కడే వాడి గదిలో
గజమంత శక్తితో రమించుకోలేక
యీ వర్చువల్ డిస్‌ప్లేతో
తన సంక్షోభపు కసినంతా
తెల్లారేసరికి అదను చూసి
ఆరని కరగని మచ్చల
గురుతులను  నిలదీస్తుంటాడూ
సూర్యోదయపు వెలుగుతో
మాయమౌతూ తనతో సహా
అన్నీనూ ...కల కాదూ

5.
లోలోన దూరాలెప్పుడూ
దగ్గరగానే వున్నట్టున్న
తనతో తానే తనలో
కోల్పుతుంటాడూ
అన్నీనూ...
6.
యే గాలిలోని ధ్వనులో
యే గడ్డిపువ్వు అక్షరాలో
యే వుమ్మెత్త కాయో
యే నెత్తుటి పిలుపో
తన కోసం తపిస్తుంటాయి
తను మాత్రం పడమరగానే
నడుస్తుంటాడూ...

మనన ద్వారంలో
పోగొట్టుకొంటున్న నన్ను
--------------------------------
1.
నిత్యత వుందా
నిరంతరత వుందా
వొక కవి పుంగవుడు
యెందులో వుండాలి
2.
క్రమం కోల్పోతున్న
కాలపు గాయం లోనా
జీవన సౌందర్య దర్శనాన్ని
కాగితాల్లోనే గాక
తన పక్కన దగ్గే వాడి గురించిన
ఆలోచనలో
ముడ్డిమీదే చలించే
వృద్ధవీరుడి రెండుచేతులూ చాచే
ధీనత్వపు అసహ్య వివశతలో
నిరంతరము తనలో
పిల్లల్లో...పెళ్ళాల్లో
అమ్మలో నాన్నలో
తమ్ముళ్ళలో సాటి వారందరిలో
పయనించే వాడెప్పుడూ
బతికేవుండునూ
కవిగానా మనిషిగానా
3.
ఆకులన్ని వొక్కసారిగా
కదులుతున్నాయేమిటీ
ఘల్లూ ఘల్లూ మంటూ
శక్తినంతా శాక్తోపాసనలాచేసి
ప్రాణాల్లో ప్రాణం పోస్తున్నాయి
అడవిలాంటి మిత్రుణ్ణి
కాపాడుకొంటున్నాయి
4.
వాడెప్పుడూ..
బతికే వుంటాడూ
రాత్రిలో పగట్లో
యీరెండూ కాని
తన స్వీయావస్థలలో
పొగకమ్మిన ఆకాశాల్లో
వర్షం మొలిపిస్తుంటాడూ
కళ్ళల్లో కన్నీరూ మెరుపునీరూ
రెండింటినీ సమతుల్యం చేస్తుంటాడూ
నా చందమామ
5.
యేదీ బరువైన తేలీకైనది
 నీలపు రాతల పై తెల్లని పూతలనా
పూతేసిన రంగుల వెనుకటి నిర్భంధాన్నా
తెల్లని స్పటికం లాంటి మనస్సునా
దానిపైన నల్లటి పొరలను కప్పేస్తే
యేదో వెచ్చని సంగీతం లాంటి
చలి రాతిరి కవిత్వలోతుల్లోనా
యీదే సంప్రదాయపు మసుగుల
స్వలింగ సంపర్క జననపు స్థగిత
స్ఖలనపు నగరగర పిండం
నేడే వో వింత శిశువును...
జనాల మధ్య ప్రసవించింది
6.
కమ్మటి సిరా వాసన
పురాతన కంపుకొడుతూ
అనాలోచిత కర్మలో
ఆలోచించినంతనయ అంటూ
లోకార్పణపూ వసూళ్ళ
మంత్రాలూ
 శ్లోకపు చివరి వాక్యాల్లా
జిహ్వలను ముక్కలు
చేస్తొందేమిటీ
7
యింకా....యేదో కమ్మస్తోందనే
మైకపు మాటల కైపులో
 నా కైఫీయతులను
ధార పోశానూ...
8
నాలో
నిరంతరతా గమనపు సూచిక
కొన్నిక్షణాలూ స్థభించింది
అకాల వర్షంలో
చలి కురుస్తోందేమిటీ

బతుకానుమతి...జీవించేందుకు
-----------------------------------------
1.
యిది కళ అని
యే వుపాధికో అపాదితమని
నిర్దేశిస్తున్నదెవరూ
2.
యే యినుపకంచో
 మరేదో అబేధ్య మొహమాటమో
 మనల్ని లోపలికీ చేరనివ్వదో
వాటి ప్రాతినిధ్యపు నేనూ
యెన్ని హద్దులు గీసుకుందో
వేల వేల వలయాలుగా
యెన్ని రోజుల వరకో
 యీ యేకోన్ముఖ వ్యక్తీకరణ
3.
యే బేషజపు నిర్నిర్మాణపు
పునాదులో యింకా
కుళ్ళి కంపుకొడుతున్నాయేమిటీ  విలువలు గాలిలో తేలిపోయి
యెన్ని సంవత్సరాలు
రోజుల్లా గడిచిపోతున్నా
వలువల్లో నుంచి బయట పడలేక
బిగుసుకు పోతూ
సాధిస్తున్నదేమిటో
అతిగా కాగితాల్లో
విసర్జించడం తప్ప
4.
కనీసం నగ్నంగానైనా
వో సారి తెరిపార
 చూసుకోవాలనీ
పిడికిళ్ళలోని
కన్నీళ్ళ గాయాలపై
ఔషధాల లేపనమవ్వగలరూ
యెండిపోతున్న అంతర్నదులనూ నీటితో నింపగలరూ
వొక అడవి తప్ప...
5.
తెలీనితనమూ...
కళలాంటిదేనా
అది కృరపు అతితెలివితనంతో
దాని అభివ్యక్తిని చంపేస్తోంది
మళ్ళీ నాలుగు చీమలూ
పడమరగా బయలుదేరాయి
వీపున నిప్పుతో
చలికాచుకుందామని
6.
యిక్కడ వుండవలసిన
కఠిన రాతిశిల యెక్కడికెళ్లిందో
యీ చెట్టు పెరిగి పెద్దదైందే
యిక్కడంతా
మెరుపుల వెలుగులేమిటీ
యెవరో జన్మిస్తున్నారూ
క్షణక్షణమూ...
కొత్తగా బతకనిద్దామా
నీడనిద్దామా
నీటినిద్దామా
నదులనిద్దామా
అడవిని అడుగుదాం....

పచ్చని రోదనలో - వెచ్చని వేదనతో
---------------------------------------------

నేను నీతో లేనప్పుడు
నీవు నాతో వున్నప్పుడు
 పెద్దగా తేడాలేదు

గరిక అక్షరాలూ నేర్చుకోలేదు
వుదయాన్ని వివరిస్తుంది
చినుకును వొడబోస్తుంది
నేలమ్మను చేతులు జోడిస్తోంది

నీవేమో అక్కడ
నేనేమో అక్కడే

 అవసరానికి కరగే మరిగే
నెత్తురూ యెప్పుడో
ఆవిరై ఆరి పోయిందేమో

అదను చూసి పిలువు
వుపయోగపు పనిముట్టౌతాడు
నినాదపు వాక్యమిప్పుడూ
నిద్దురలో నిలువన
చీల్చేసే నిద్దురలో
పగలే యెక్కువగా
కమ్ముకొంటో..
కనుమరుగైంది..

యెవడికి వాడు
దొరికిన చోట
ప్రాణాన్ని తోడేసి లోడేసి
రాళ్ళను నింపుతున్నాడు
యే జీవి యేక్రిమీ
బతకని చోటును
సృష్టిస్తున్నాడూ...కొత్త
నాగరికతకు
అఆల్లాంటి వర్ణాలు
ఆకాశాలాను తాకుతాయట

చలి కానని వొంటరితనంలో
పుస్తకాలలోని నగ్న దేహమై
వెచ్చదనం కోసం యెన్నిరోజులూ
వేచి చూస్తూ వో సౌకర్యమై
బయటపడ్డాను
మరలమర్మాంగాల తయారీలో
పోగేసుకున్న ఫలితాలూ యెక్కువే
వేరైపోతున్న కరచలనాలూ
వొంటరి వుత్సవాలలో
కోల్పోయో పొందుతో
చీమల చిరునామాను
లోపలి పురుగులను
చంపుకొంటూ...

నా వీపున పెరుగుతున్న
కాకులూ కోయిలలు
మురికి , చెమట
బురద పలుపు
పశువు యెర్ర
చేప చాప నార
పైగుడ్డ మొలగుడ్డ
గీతం రవిక కోక
మొలతాడు
పసుపుతాడు
అన్నాలూ కూరలూ
వీటిని చంపుకోలేనూ
బతికించుకుంటానూ
మరో సారీ
చీమలతో కొంగలతో
అన్ని క్రిములతో
మాట్లాడాలీ

నీ నెత్తిన పెంచుకొంటున్న
కృత్రిమ రాళ్ళు
యెందుకు
ఆకాశం వరకు
యెక్కుదామనా
పొరల లోపలి శిల
వో సారి కంపిస్తే..

రేపు నను నేను లాక్కెళ్ళిపోతూ
----------------------------------------
1.
నను నేను విడిపోతున్నట్టి
నేను నన్ను లాగేసుకున్నట్టి
మళ్ళీ నా నుంచి తరుమేస్తున్నట్టి
లోతులకు చేరిపోతున్నట్టి
దిగంతాలు దూరమై పోతున్నట్టి
అశ్రుదశ దాటిన గాయస్రావమైనట్టి
అస్పష్టమైన తెరలోపలి కత్తేదో
నా గుండెల్లో దిగిపోతున్నట్టు
స్వప్నపు చివరి క్షణాన
వేలాడుతున్న నాకు
నేమ్లెస్ కమొడిటీ విత్
సెల్ప్ డిక్లరేషన్
2.
వున్నతీకరించుకోలేని
హీనస్ ఆలోచనలతో
కట్టిన వాడి బూడిద
నిర్మాణాలపై
నన్ను నేనూ
కూల్చేసుకొంటూ
నన్ను నేనూ ముక్కలౌతూ
స్వప్నించలేని స్వప్నంలో
గడ్డపు పచ్చని వెంట్రుకల
పదఛ్ఛాయలు
జాన దూరంలోనే వుంటూ
అరచేతిని నాకమంటూ
రిథమిక్ ఖయాస్లో
3.
యే ఘాఢతలేని
పొగలాంటి
తెల్లని రంగుల్లో
ముంచెత్తే నా భ్రమను
నాలుగన్నర ముళ్లగుళ్ళను
యినుప రక్తంలోనికి
లాక్కెళ్ళుతూ
నోవిధ ప్రతి యేదో
నా మొహంపై గాట్లు చేస్తూ
క్రష్ఢ్ యిన్
బ్లాక్డ్ వ్యాక్యుం
4.
నేనింతేనా
నువ్వింతేనా
నే నా ల మధ్య
వొక పక్షియీక రాలి పోదూ
మరో దేహం నలిగిపోతూ
మృత్యువు నెత్తిన చస్తూ
నేనూ దాని వంతుకు
గోచీలాడుతూ
జస్ట్ ఫర్ నథింగ్
అయామ్ మోస్ట్ వాంటెడ్

నీవు నేను కాలేక
నేను నేనై
..........................
నీ వారు నిన్ను ద్వేషాన్ని నేర్పించారేమో
ప్రేమించడం మాత్రమే మాకు తెలుసు
యేళ్లతరబడి సహించలేనంత వోర్పును మా వారు యిచ్చారేమో
అనుకోకు
కనీసం నీ వారినైన నీవు నీవారుగా చూడగలవా
వొక కన్ను తీసి యింకో కన్ను వుంచుకుంటున్నావు
ఆ మరో కన్నును నీవే పొడుచుకుంటావు
చంపేందుకు కొత్త మార్గాలు
నీవు అన్వేషిస్తూనే వుంటావు
చావును ప్రశ్నగా చేసి
ఐచ్ఛికతపు సమాధానాలు
మా ముందుంచానని
సంబరపడిపోకూ
గుండెల్లో హోరెత్తిస్తున్న
యెవరిని యేమిఅనకండి
యీ మాటలతో
పిడికిళ్ళు బిగిస్తున్నాయి
నీ కులాధిక్యత కోసం
ప్రాణాల్ని తీస్తావా
నీ కంటే నాకే బతికే హక్కు వుంది

వేల సంవత్సరాలు
దోచుకున్న వస్తు సంస్కృతి
నిన్ను పెత్తందారిని చేసింది
నేను నీలా మలమూత్రాదులు
నాకీ నాకీ బతకను
నా పని మా అందరి పనిలో
చేయి కలపి బతుకుతాను
ప్రేమించడమే నా సంస్కృతి
నేను మెట్లను కూల్చేసానూ
నీవు కట్టుకుంటేనే వుంటావు
నేను భూకంపమై వస్తాను
నీవెలా నిలబడగలవో
తలెత్తితే దించలేను
అది యెప్పటికీ
మా తలలు యెగిసాయి

నీవు అవసరమైన చోట దించి
అవసరమైన చోట యెత్తి
నటిస్తుంటావు
నీ వొంచిన మెడను బలి
యిచ్చేందుకు
మా రోహిత్ పిడికిళ్ళై
వస్తున్నాడూ
దేశవ్యాప్త ఆగ్రహమై
వొక నొప్పి వేల ఆలోచనలను
వొక కన్నీటి బొట్టు లక్షల నినాదాలై
మండే గుండెలతో
వుమ్మడి నిర్వహణలతో

సతతం  మరణం
---------------------
యీ సమయం
యీ కలల దేహాన్ని
లాగేసుకుందీ

యీ రాతిరి
వాడిన పూలు నీవేనని
మభ్యపెట్టింది
నా పుట్టుక

యెప్పుడో పుట్టిన నేను
యెప్పుడూ చస్తున్నానేమిటి

పుట్టానని నాకే తెలియదు
మరిచిపోయానేమో

నిద్రలూ లేవు స్వప్నాలు లేవూ
వాటి సంభవనాశలూ లేవు

యీ బతకు నన్ను పిండి
నా చెమటను నాతోనే తాగిస్తోంది

తిరిగొచ్చే రాత్రులు మళ్ళీ మళ్ళీ
మోసుకొస్తునే వున్నాయి
నావి కాని నిద్దుర రాని రాత్రుల్ని
నన్ను నేను పోగొట్టుకొంటున్నా రాత్రుల్ని

సత్యాలన్ని నిజాలై నిలుస్తుంటాయి
జీవితాలన్ని నల్లని తెరలై యెప్పటికీ
వుదయించని రాత్రులౌతాయి
నేనేమో యేం చేయలో తెలీక
వీడ్కోలుకు నా చేయందిస్తాను

 నా మట్టి వాసన నాకు కావాలి
----------------------------------------
వొకప్పుడు
యీ వేళకు
నా నేలలో
వో పచ్చని పైరగాలి వీస్తూండేదీ

చేలల్లో యెద్దుల యెనక
కాడి పట్టిన నాయన
ఆయన యెనక నేనూ

రెపరెపల పంటకంకులు
వొంగి వొంగి పక్షులు
వాలేందుకు మెడలిచ్చేవి

నిన్నటి కోతలకు
నేటి బురద అడుగులు
గురుతులుగా మిగిలేవీ

యిప్పుడేమో
అరకాలికి
చిన్న రాయి తగలని
గట్టి రారహదార్లు

పైర్ల నేలలేమో
పొగలు చిమ్మే
దుమ్ము రేపుతూ
ప్రపంచానికీ
ట్యాగ్ చేయబడ్డాయి

కూలీలై
బస్టాండు లో
తిరగాడుతున్నారు
రైతులు
యెవరో
తన నేలలోకీ వచ్చీ
పరాయి వాణ్ణి
చేసేస్తున్నారు...

యీ మట్టి గంధం
మెల్ల మెల్లగా
యే పూర్ పర్ ఫ్యూమ్ గానో
మారిపోతోంది

నా వూరూ యెక్కడికో
నెట్టి వేయబడుతోంది
నా వారు నా జనం
మెల్ల మెల్లగా
ఎ...బ... న్డ.. న్డ్..

నా పండుగలు పబ్బాలు
నా బంధువుల రాక పోకలు
నా పిల్లల పెళ్ళిళ్ళు
యిన్నేళ్ళ స్నేహాలు
మిత్రులూ...యెక్కడికి

నీళ్ళ నేలలన్నీ
కాంక్రీటు బంజరు భూములై
శాశ్వతంగా
వొఠిపోతున్నాయి

జల సాగరాలు
అర్థాల్ని కోల్పోతూ
మరో నాగరికతకు
రూయిన్డ్
చేయబడుతాయని
భయపడుతున్నాయి

దాహాన్ని తీర్చే
ప్రాణాల్ని నిలిపే
నీరు గింజలు
యెక్కడికెళ్ళాలో
యోచిస్తున్నాయి

అప్పుడప్పుడు కురిసే
చినుకులు
నిరర్థకమైపోతాయేమోనని
యింకేందుకు
నేల కనిపించదని
యిటు రాకూడదనే నిర్ణయించుకుంటాయేమో

యెక్కడికి తీసికెళ్లునో
యీ కాంక్రీటు పునాదులు
యింకా తీరని అవసరాలే
యెక్కువగానే వున్నాయి

యెవరైతేనేమీ
నా నేలను లాగకూ
నా వూరిని జరపకు
నా మట్టి వాసన
నాకు కావాలి...


అలా అలానే కాలేక
...........................
1.
వుండిపోతూ
మిగిలిపోతూ
వొంటరిగానే
నేనెలా నడుస్తున్నానో
నా అనబడే కాళ్ళపైనే
నిలబడివున్నానా
యేదో నిలబెట్టిందా
అది నువ్వేనా
స్మృతి పటలంపైని హింసే కదా
2
 యే మానమూ లేని
యేకోన్ముఖత్వమేనా
నేనుకూడా జారుతున్నది
యీ మాట పెగల్లేక పిగిలి
గొంతులోనే ఆవిరౌతోందేమీ
యెవరో కల్పించుకొని
వెంటాడే తిరుగమనంలో
నన్ను నేను తరుముతూ
వెనుకే మంటలార్పానూ
3.
నా ముఖం యే దిక్కుకు
వెళ్ళాలో దిక్కుల్లేని
నింగివైపుకా...మొరెత్తి
వుదయించని వుదయం
వైపుగానా..
చిట్లని చుక్కలవెలుగు
కళ్ళల్లోకి బద్దలవ్వక మునుపే
వీడ్కోలు తెరవని తలుపై
ముళ్ళను మైళ్ళ మొలలపై
నిలిపించుకోలేక ....
గాఢంగా ద్రవించుకొని
స్రవించుకొందును
4.
వో సారి మొహం చాటేసి
మరో సారి బరువుగానే
లాక్కెళ్ళి శరీరాన్ని
అశక్తంగా గడిపి నలిపి
యెటో...యేంటో...
అనుకొని...
చెట్టుకు వెలాడే నీడనై
రాలలేక
నేలపై కరిగి
పోదామనుకొన్నాను
5.
జీవితపు జీవాన్ని
మళ్లీ మళ్లీ  పొందాలని
కోర్కెను మేల్కొపిఅలసి
 వున్నదాన్ని వొదిలి
యే పాత పొత్తాన్ని
పొదివించుకొని...
వెళ్లలేక...
6.
మేల్కొనాలని నిదురపోలేక
వొదులుకొన్న వొంటరి తమకాన్ని
మళ్లీ తరచి చూడలేక
నను నేను
చూసుకోలేక
అలా
వుండిపోలేక
కణపుపొర లోకి
దాగి
పరుగెత్తి
దాగి
కలసి
పోయానీ
రాతిరిలో

వస్తుచీకట్లో...
.................
1.
నేనింకా కళ్లు తెరచి
నిద్రపోతూనే వున్నాను
నా చుట్టూ యన్నెన్ని
వస్తువులూ
రంగురంగుల్లో
కృత్రిమ ఆకర్షణలో
2.
అద్దాన్ని అబద్ధం చేసే
వొందల వస్తువులు
నేనెక్కడో
కనుక్కోమంటూ
నా నిండా
యీ వస్తువులేమిటీ
నా స్పృహనిండా...
నేనూ
వస్తువునైపోతున్నానేమిటీ
అక్కడక్కడే
వొందల వేల మారకాలు
క్షణక్షణం
నా చుట్టూ
యెవరున్నారని
నేనూ నా వస్తుచీకటి
అలానే కన్ను మూసేసాను
నిద్ర నిస్పృహా మరణం కాదా
3.
దారి తప్పి వచ్చిన గాలి పటంలా
వో వర్ణరంజిత చిత్రం
నన్ను వెంటాడుతూనే వుంది
అందులోని వో కన్నీరు కార్చే
సన్నివేశపు సన్నికార్షణకు
చుట్టూ చేరిన ఆ.అమూర్తులూ
వర్ణంలో వర్ణమై కరిగిపోతున్నట్టు...
నేనేమో అక్షర రూపాన్నే
చూస్తున్నానేమిటీ
చిన్న పసికూన దోసిళ్ళలో
వొదిగుతన్న యీ నిస్సహాయత
ఘనీభవించిన కన్నీరు
నాలో గట్టిగా వుమనదేమిటీ
4.
పండకనే
రాలి  పోతున్న ఆకులు
ప్రవహించే ధారల్లో
శవాలై తేలుతున్న చేపలు
విషాద గేయాలై
పుర్రెల్లో కన్నీళ్ళై
భగభగమండే నిప్పు
కణాలౌతాయి
గతించలేక కారుతూ
-------------------------
1.
రాతిరి లో చీకటై
పగల్లో వెలుగై
గాలై నాలో
మార్మిక కణమూలమై
నాలో శ్వాసై
వేలాడుతూనే వుండే
వో మృత్యు పరఛాయేదో
అభావాత్మకంగా
చుట్టుకుంటుండగా..
2.
అదే
అనుకునేంతలో
వో పెగ్గు...వో దమ్ము
కరిగే కాలే వేళలలో
నరామయశబ్దదుంధుభి
వినమ్రంగా యెగిసే
లీనలోలకాలకు అతీతంగా
 నెత్తురు తెలతెల్లగా
రాలిపోతున్నట్టు...
అలల కిందుగా
జారలేక వూగుతూ
వుండి పోవాలనిపిస్తుంది
3.
ప్రాణ స్థంభనలో
చివరి శ్వాసకు వేలాడే
ఆ అసక్త క్షణపు నివృత్తి
హాయిగా పైకెగబాకి
నిన్ను నన్ను
యేకం చేస్తానని
సాపేక్ష ఘడియలను
ఆవిష్కరిస్తానని
రేణువు గొంతెత్తలేక
అనిద్రా మోహంలోనే
వుండమంటుంటే
పొగిలి పొగిలి
నవ్వి నవ్వి....
4.
మళ్ళీ మళ్ళీ
పునరావృతమయ్యే
వో సంక్లిష్టతీవ్రతర్కపు
విలువేలేని గడ్డపు రొచ్చులో
సుగంధాల సుమాలు
విరబూయడం
నేనే దర్శిస్తున్నానేమిటీ
అందరూ చచ్చాక
నేనేం చేయను
బతికి...
5.
పాద రోకలితో
నడుమబిగించే
ప్రతీకలై నిలవని అద్దాలలో
చూడలేనిప్పుడూ
వాడిని వాడో
నన్ను నేనో
చోరగించుకోలేనంతగా
6.
మరీ...
చితికి పగిలి
కారే పారే
కారణాల పొడిరేఖలు
బల్లమీద
ముడివేస్తే .....యెలా
ప్రశ్నను ముక్కలు
చేస్తున్నప్పుడు..
మత్తించుకోలేక....

హననము
------------
మెల్ల మెల్లగా నీడలు
కొమ్మలతో బాటు
విరిగి నేల రాలి
పోతున్నాయి
వొక్కొక్కటిగా
వొక్కో ఆలోచన సమాధి
చేయబడుతోంది

వేల యవ్వనాలు
స్వప్నించిన భవిషత్తు
బలవంతంగా
నలిపివేయబడుతోంది

చీకటిని తరిమేయండంటే
చీడపట్టిందంటు
చెరసాలలో
చిదిమేయబడుతున్నాయి
వెలుగు కోరిన
వేల స్వేఛ్చా స్వరగళాలు

మేల్కొంటున్న మేధను
ప్రశ్నిస్తున్న తరాల
నోళ్ళు కుట్టి
వేయబడుతున్నాయి

జీవితాల కోసం
 రంగులను కలగంటున్న
మనసులలో
విధ్వంసపు చీకట్లను
కూరుతున్నారు

యిక్కడ
సమాధౌతున్నాయి
సహనం, స్వేఛ్ఛ
సమానత్వాలు
అర్థాల్ని కోల్పోయి
చాలారోజులైంది

యిక్కడ
మనిషిగా చచ్చి
శవాలై తిరిగుతు
ముద్రల్లేసుకున్న
హీనభక్తి
రాజ్యమేలుతోంది
మరింత చీకట్లోకి
నెడుతోంది అందరిని


యేమిటో యిలా
--------------------
నేను యిలాగే
వెలాడుతున్నాను
వేరౌతున్న నా
 తలల వురితో
మొండేలతో

జారిపోయే సిగ్గు
వో పిండంలో పెరుగు పోసి
నను రమ్మంటోంది

గోడలకు అతుకున్న
గాయాలు
యెంతకీ తెగని కాలం
కాళ్ళను చుట్టేస్తోందీ

చిట్లిపోతున్న పొలుసులు
యెముకల్లోని సమస్త గుజ్జు
నల్లమందై పేల్తుంటుంది
దేహాతీతమై

కావాలనుకొన్నది
పొందాలనుకొన్నది
యీ రెంటి మధ్యలోని
వో తెల్లని ఖాళిలో
నల్లగా మృత్యువు
మేల్కొంటూ వుంటూనే

సంచరించే కలలు
ఫలించే స్వప్నాల కావల
భగ్నమౌతున్న
జీవితాల ముక్కలను
రూపంలో...సారంలో
కవితాత్మకంగా వ్యక్తీకరించలేని
పండితుణ్ణీ కాలేక

కన్నీటి వుప్పదనం
నేనై
వొందల వేల జతల
పాదాల కింద నలిగి
రాలిపోతున్న ధూళినై
మిగిలిపోతూ....


సలుపు
---------

యే మృత్యువో
శబ్దమై
నిలిచియుండును

చావు దేహమైతే
ఆలోచన కనిన
మనసు
చెట్టై బతికియుండను

హింస కాటేస్తున్న
విషపు వ్యాపారం
ప్రశాంతతలో
అల్లకల్లోం సృష్టిస్తే

చూడలేని హృదయాలెన్నో
చలించినపుడు
యే శక్తులో
కన్నులు పొడిచేస్తుంటే

డిజైనర్ల ఆకాశంలో
మొలకెత్తని తర్కాలే
కొత్త దారులంటా
పాత వెలుగులంటా

చచ్చిపోతున్న మనిషి
యే నవ్వులూ దుఖాలు లేని
నిస్పృహ లో
నాలుగు గోడలలోనే
బతుకుతూ

సలపరించే గాయాలను
జీవితాంతం మోస్తు
యిదే అలవాటుగా
మార్చేస్తున్న
శాసనం....

దివానా...ఫిలాఫనా
------------------------
1.
నేను
నా యింట్లోనే వున్నాను
నా పాత్ర పొయ్యిమీదే వుంది
నిప్పురాజేసే వేళయ్యింది
గడ్డకట్టిన మంచును
కరిగించుకోవాలి
2.
నేను
ఆరవ మూలాన్నై
ఆపేక్షతో
మూడు పూటల
చింతను కాల్చేసీ
దేహాన్ని వేడెక్కించి
ఆకాశపు ఖాళీలోకి
తేలిపోతూ
లయమౌతూ
నేలను
స్పర్శించుకుంటూ
3.
తర్క వితర్కముల
సమాధులలో నిదురోక
అతుకుల బతుకుల
 ప్రేమను పొందుతూ
ఆలేఖ ఛాయలో
పిచ్చోడినై నిదురోతూ
నిదురపుచ్చుతూ
4

రెండు కణుపుల మధ్యలో
శ్వాసిస్తూ
బతికుండగానే
మరణిస్తూ....
చస్తూ...
స్తూ...
స్తు...

నిలవని నాలుగు మాటలు
----------------------------------
1.
యీ అనవరతంలో
మరచి పోయే ఆవాహనం
యేదైనా వుందా?
2.
వో
దృశ్యపు వీక్షణ కోసం
వొందల జీవుల త్యాగమూ
పనరుత్పాదిత దేహమూ
శ్వసతో ప్రాణం పోస్తుంటుంది
3.
ప్రతి రేపు నిన్నటి జ్ఞాపకం
నిలుచునులే రమ్యంగా
లేఖనఖాక్షరమయ్యే సిరానో
వెండివెలుగులానో
నిరంతరామూర్తతాభాసం
నిను నన్నుగా మార్చే
విశ్వంతరాంగిక కౌగిలిలో
4.
యిక మిగిలింది
మిగలాల్సినదేమైన వుందా
కృత్రిమ నిర్మాణాలను
లోపల బయట
వొదిలేసుకుంటూ
స్పర్శలను లోతుల్లో ముంచేస్తూ
చచ్చి పోతూ ...
5.
నిన్న లేనిదేదో
 నేటికి నిలబెట్టి
రేపటికి కూలిపోతూ
తాగి తూగే రొట్టెముక్క
వుదయించే కువకువ కోసం
రెప్పలను రెక్కలను చాచి
నీలోని నాలోకి వాలిపొతూ
సందడి చేస్తే.....
కలలా కాదు
యుటోపియన్ లా కాదు

పాత పుస్తకపు చావు
---------------------------
1.
చనిపోతున్న కనిపించని
కాలపు నిరామయతలో
దృక్పదాల మృత్యువేదో
హద్దులను చూస్తోంది
అది కమ్ముకొంటోంది
జీవితాల వ్యస్థతలో
రీసైకలింగ్ డెత్స్ ఆన్ మై
వోన్ ల్యాండ్
2.
కలిసో విడిపోయినట్టున్న
నిలవలేని రంగుల్లో
లోపలో బయటో
నల్లని దిగులులో
పచ్చగా నీడలు కమ్ముకొన్నట్టు
భ్రమింపజేస్తూ
యెర్రగా ద్రవిస్తుంటాయెప్పుడూ
డెత్ యిన్ రిటైనింగ్
3.
యుధ్ధపు స్వభావాలలో
రాజకీయ సన్యాసపు హింసలు
వుమ్మడి వీడ్కోలును
సమాంతర జీవితాలలో
పరిపుష్టంగా మనిషిలో
స్వలింగ సంపర్కపు
వుత్పాదకతకు బీజాల
రూపకల్పనకు విదేశాలకు
వెళ్ళే నా కమండలము బొచ్చె
రిలిజియన్ యీజ్ ది మెషర్
అఫ్ డెత్..
దెరీజ్ ఎ న్యూ ఫేజ్ ఆఫ్
రిలిజియన్
4.
వుయ్యాలలో వూగే గోడలన్నీ
యెగురుతున్న పిల్లల బుడగలను
కూల్చేస్తున్నాయి రక్తిని చంపేస్తున్నాయి
బాల్యపు వింతలోకాలను
 యింటిపైకప్పులకు చేర్చే సంకెళ్ళుగా
గతంలేని కాలపు పాత జ్ఞాపకాలను
మరచిపోతున్న ద్రవాలను తెరల కింద
జోగాడుతున్నారు
మెర్సీ కిల్లింగ్ బిఫోర్ డెత్










































































































































































No comments: