Monday, March 28, 2016

చుట్టూ నలు దీపాల చీకటి
-----------------------------------
1.
నరనరల్లో సరసర పాకే
ప్రాణపు చుక్కకు
యీ ప్రపంచపు చుంభనమేదో
వురివేసి లాక్కెళ్ళినట్టు
నన్ను నిలబెట్టింది
పరాశ్రయమై
2.
వొందల చేతుల శ్రమ యేదో
వాడి సొంతమయ్యే సంధర్భాలను
వాడి చుట్టూ తిప్పుకుంటూ
కడుపుకు చేతికి లంకె ఆశ చూపి
వాడు నిరంతరం పోగేసే ప్రయత్నంలో
మెడ చిట్లి మృత్యువును పలకరించిన
మళ్ళీ మళ్ళీ సమాధి వైపుకే కదుల్తూ
3.
విడిపోయిన యెడబాటేదో
కనిపించని ప్రేమకూ
చేష్టలుడిగిన నేనూ
నిరంతరపు వుద్వేగంతో
ఆకలై యెదురు చూస్తుంటే
మౌనపు భాషను మోగించే
చెట్టు గాలి, వడ్రంగి పిట్ట
తడారుతున్న గడ్డి పరక
కదలికలు...
చుట్టు మడుతుంటాయి
4.
వినాశపు గీతమేదో
నవ్వినపుడూ
యుధ్ధభేరి భళ్ళున
పగిలినపుడూ
చిగురించాల్సిన పోరాటం
వాడిపోతున్నప్పుడూ
తరాలు గడిచిన
రూపాలు మారి
దేహాలను ఖండించే
వ్యూహాలు వొకటై
నిలుస్తున్నప్పుడూ
సమాధులకు చోటెక్కడా


యెక్కడ నీ నేనులు
--------------------------
1.
నాదేహపు దారుల్లో
తప్పిపోతున్న వారేలేరూ
దృశ్శిస్తున్నదంతా ఆత్మరాగమై
పలకరిస్తూనే వుంటుంది
2.
కాలపు కలవరింతలను
కక్కనూలేనూ
దాని కలల కళలనూ
కొలవనూ లేనూ
3.
నవ్వుతున్న రంగేదో వొంపుకొని
పూల పరిమళాన్ని చిత్రించుకొంటూ
నీటి నీలిరంగును వేరుచేయలేక
చెట్టులేని గాలిని తాకలేక
వూపిర్లను ఆపుకోలేక
ఆకలిని దాహాన్ని జయించలేక
దాని ఆనుపానుల్లోనే వొదిగీ వొదిగీ
4.
సాపేక్ష కోరికల సాంద్రతను
సహజాతాల తీవ్రతను
తిండి రేపే అలజడులను
భరోసాలేని బతుకుకు..
5.
రెండున్నాయన్న వొకటేయనిన
అంకెల వెనుకటి లెక్కల తర్కం
తడిని కనుగొనలేని రాధ్ధాంతం
నిర్మాణాల మోహంలో
రాస్తూనే వుంటాడు
వేల వేల పుటలు
లక్షల కాగితాలలో

పైన్ తో పయీన్ కోసం
------------------------------
1.
మృత్యువు కనిన వారెవ్వరూ
కొందరి యాత్రల్లో పీడకల కూడా
 కానంతగా
వారి అక్షరాల్లో
పొదిగి వుంటుంది
2.
దేనిని యెంత చేరదీస్తామో
యెవరి సంకల్లో యేముంటుందో
సంగీతమూ
చిత్రలేఖనమూ
ప్రకృతి
ప్రేమ
మృత్యువు
3.
నిరంతర జీవితపు క్షణాల్లో
ఆకాశపు మరణపు రంగుల్లో
వెలుగు నీడల దోబూచులాటల్లో
యెడారి యెండల్లో
సుదూర అస్తమయపు చీకట్లలో
వెంటాడే మృత్యువు నగ్నంగానే
ఆవహిస్తుంటుంది క్షణక్షణం
4.
బాల్యాన్ని హరించిన మృత్యువును
వొక కంటిలోనే కాపాడుకొంటూ
రంగుల స్నేహంతో
ప్రతీకారంతో
తన సృజనలో కసిదీర
చంపుకొంటూ
పక్కనున్న దానిని మళ్ళీ
కాన్వాసుపై చంపి
చివరికి దానితోనే జతకట్టి
వో రోజూ వీడ్కోలు పలికాడు
5.
నా స్వప్నపరిరక్షకుడు
నా మృత్యు దర్శితుడు
జీవన రంగుల్లో గాఢతను
తాగిన వాడు...
తాగించినవాడు

(గణేష్ పైన్ చిత్రకారుడు పరమపదించి
మూడు సంవత్సరాలై పోయాయి...
ఆయనను గుర్తు చేసుకుంటుండగా)

ప్రాణం కోసం
----------------
1.
వో పదునైన అంచుల మీద
వస్తు ఆవరణా భారంతో
వొంటి కాలిపై నిలబడ్డ నా దేహం
వుఛ్వాస నిఛ్ఛ్వాసల సమతుల్యతలో
ఖాళీ ఖాళీ అవుతోంది
అది నా చివరి ప్రపంచం
2.
నా చుట్టూ వున్నవన్నీ
అగాధాల్లోకి జారిపోతున్న స్పృహలో
బరువైన మనసులతో
అరచిన అరుపులూ
పెడుతున్న కేకలు
నిద్రనుంచి నిద్రలోకే జారిపోతున్న
వొంటరి వుమ్మడి దేహాలు
3.
అపరిమిత రాశుల మోహం
యెండిపోయిన అసిధారామృతాలను
నిన్ను నువ్వు తాకలేని తలంలో
 యెక్కలేనన్నీ యెవరెస్టులను
ఘనంగా నిర్మించుకొంటూనే వుంటావు
4.
నీవొక పారంగతుడివే
మా లక్ష్యహీన శ్మశానపు
విశ్వవినీలంలో యాత్రించినోడివే
నిర్మాణాలను చూస్తూ
వినిర్మాణాలను కంటూ
లోలోనే ఆకలిని
చంపేసుకొంటున్నావు
5.
ధర్మమును దాటి
జ్ఞేయాజ్ఞేయములను దాటి
సకలాన్ని తనను ప్రేమించి
విశ్వవితరణపు సంభోదంలో
పూర్ణమయ్యే శూన్యంలో
యెగరీ యెగరలేక
అలా వో మొక్కనై
గాలి వీస్తే వూగి
వాన కురిస్తే తడిచి
యెండకు యెండి..
గతించలేక ప్రణప్రాణన్ని
వొదిలీ వొదిలీ....

వో ఆవాహపు అలికిడి
------------------------------
 వొకానొక వేరు నిద్రలేస్తుంది
జీవం కోసం చేతులు చాస్తున్న
వో పందిరి తీగ నన్ను అల్లుకొంటోంది

నేల రాలలేక బీటలు వారిన
వో ఆలోలోచనం
ముడుచుకుంటున్న ఆత్మలలో
నిద్రపోతూనే వుంది

యెవరెకి వారు యిసుక రేణువులు
మరెవరో శిలాకైవల్యపు పరవశంలో
యింకెవరో దౌడుతీయక
 కూలిపోతున్నట్టు
గొంతులోని గాలిని స్థంభించగా

వశముకాని వో షట్చక్రపు
గతిహీనతకు
సంగమసంకేతాలను ఆశ్రయిస్తూ
విలోమంగా శాక్తేయమౌతూ

నేనేమో దర్శించలేని
అతీతత
వో అవూహాగాహనమౌతూ
యెవరో తంతించేందుకు
నాలో కైపును
కమ్మగా కలవరపు కైతలను
వొంపుతుంటే

ఆ వృక్షపు నేలకింది
పొరకమ్మిన ఆరక్షణలో
వో రేణువునై లో లోనికి
వెళ్ళలేక....
ఖాళీ కాలిబాటలనే
చూస్తున్నాను

 కలవగానే కరగలేక
--------------------------
1.
చేతులు
పగిలిపోతున్నప్పుడు
ఆకాశంలో
వో కేక బద్దలౌతున్నప్పుడు
నీవు నేను వినలేని
నిలవలేని నిర్మాణమేదో
లోలోపలే కూలిపోతుంటే
మళ్ళీ మళ్ళీ
నేలరాలి పోతున్నప్పుడు
సంఘర్షించుకొనే అనేక
అస్థిత్వ పోరాటాల్లో
నిత్యం మృత్యువు దాగుడుమూతలాడుతూనే వుంది
2.
 అంతరవిశ్వంలో
వో దిగులెప్పుడూ
చిన్న యిసుక రేణువే
యెన్నో పరదాలు
తెగిపోతున్నప్పుడూ
మరెన్నో విశ్వాలు
జన్మిస్తూనే వుంటాయి
3.
పరాధీనమౌతున్నంత వరకు
స్వీయచరిత్రలు
లిఖింపబడుతూనే వుండును
నీలోని వేల జన్మలూ
గుర్తురానంతగా
చచ్చిపోతున్నప్పుడు
పుటలన్నీ
ఖాళీలే ఖాళీలే గదులన్నీనూ
4.
వినిపించుకోని వేళ్ళన్నీ
అరిగి స్రవిస్తూ రాలిపోతున్నప్పుడు
గోర్లు పెట్టే కేకల్ని
యే ఆవరణమో తస్కరిస్తుంది
నిన్ను నన్ను
చూడలేని చీకటిని
బరువుగానే
శ్వాస లోనికి నెడుతుంది
5.
నియంత్రించలేనంత వక్రత
కనిపించనంత విధ్వంసం
నిరంతరమౌతూనే వుంటుంది
కుప్పలు కుప్పలుగా
లోలోనే...యెప్పటికీ
నీలో నాలో
నేనూ మనిషేనా
--------------------
ప్రకృతిని నేనేనట
ప్రకృతి మూలమూ నేనేనట
ఆ అనంత తత్వపు
ఆ లోతైన గాయాలను
మోస్తూనే వుండాలట

పవిత్రత అపాదించిన
దేవుని బిడ్డను నేనేనట
నాకు పెళ్ళి లేదూ
పెడాకులూ లేదూ
దేవుని పేరుతో
కామంధుల వశమయ్యేదీ నేనే

నన్నెందుకో
 సగమని
 రాసుకుంటారు
చెప్పుకుంటారు
విశాలగగనమూ నాదేనని
అర్థ దేహశక్తి నేనేనని
యెన్నో మరెన్నో
వుటంకించారట
నీలిమేఘఛ్ఛాయలు నదులై
ప్రవహించేనట

నేనెందుకో నన్నెందుకో
యిన్ని ఖండాలూ
యిన్ని యిచ్చిపుచ్చుకోవడాలు

నేను మనిషేనా
యీ దేహఛ్ఛేదనలేటి
యీ బహురూప వ్యక్తీకరణలేటీ
మనిషిని మనషిగా చూచేందుకూ
లింగ భేధాల శాస్త్రాల్ని
అనాదిగా కొనసాగించడమేమిటి
యిప్పటికి నన్ను
విశ్వవ్యాప్తంగా దయ్యమై (లేని)
చూడ్డ మేమిటో

వో చెయ్యి తో కరచలనాలూ
మరో చెయ్యితో చప్పట్లెలా మోగునో

యే సృష్టో
నన్నిలా మోస్తోంది
బరువుగా దిగులుగా
నేనెప్పుడూ చింతలకు
ఆశ్రయించేటట్టు చేస్తుంటుంది

బలిచిన వ్యవస్థలో
బలిపశువును నేనూ

సృష్టికి ప్రాణం నేనే
మరణం  నేనే
అర్థాంతరంమై

రీ ప్రొడక్టివ్ యంత్రం నేనేనట
స్లట్ ఫర్ ది ఫక్ ఆఫ్ బుల్స్
ఆఫ్ బిజినెస్
అయామ్ యింటెండెన్డ్ కోర్స్
ఫర్ ది హెవీ డోస్ టు ది వర్ల్డ్

యీ నోషన్ మారేనెప్పుడో
నేను నన్నుగా మనిషిగా

యీ దివారాత్రులు తొలిగి
యీ దినోత్సవాలు లేని
రోజులెప్పుడో...

నాసీమ కరువు కోసం
-----------------------------
1.
నాసీమ కరువు మొలక కోసం
మరో సారి వేచిచూస్తోంది
కన్నీళ్ళు ఆరిపోయిన
కళ్ళతో
2.
కరువు కురిపించే వసంతపు జల్లులో
మొలవలేక చిగురించని చిగురు అప్పడే యెందుకని వొందల
ప్రశ్నలను కారణాల వెనుక
దాక్కొంటోంది
3.
నాటిన మొక్కలు బతకలేక
వేసిన పంటలు చేతికి రాక
ఆత్మహత్యల పంటలు
పుష్టిగా పండే పంటకాలం
యెప్పడూ ఆరుగాలం
పండును నా చుట్టూ...
4.
సేద్యం వో గౌరవ చిహ్నమిక్కడ
పశువులు గొడ్డు గోదలు నిత్యం
పిల్లలకంటే యెక్కువగానే పోషింపబడును
తాము ఆకలితో వుండి
పశువులను కడుపు నింపబడును
5.
అప్పులు గుట్టుచప్పుడు కావు
దున్నకాలై కలుపులై
కూలీలై రవాణాలై
చేతిలో నుంచి జారి
మెడకు చుట్టుకొనే
వురి ఖర్చును మిగుల్చును
6.
నా సీమలో భుమి వున్నోడేమో
వురిని ప్రేమిస్తుంటే
అతనిపై ఆధారపడ్డ కూలీ
చావలేక వలస వెళ్ళిపోయాడు
 తిండికోసం దొంగైనాడు
మనుగడ కోసం బిక్షగాడైనాడు
యిక అతని పిల్లలు
పెళ్ళాం వున్న కొంప
వొదిలేసి నగరకూలీలైనారు
బిక్కు బిక్కుమంటూ
7.
గొర్రెకాపర్లు నదీ పరివాహక
నీటి ప్రాంతాలకు వెళ్ళాలనుకొంటున్నారు
అక్కడికెళ్ళాలంటే
పిల్లాజెల్లా మూటా ముల్లి
 గంజికోసం గింజ సట్టి
మూట కట్టుకోవాలి
8.
యే యెన్నికలకో
గుర్తొస్తారూ
వారికోసం
వో యంత్రాగం
కల్లిబొల్లి మాటలతో
కడుపు నింపి
అదృశ్యమయ్యే తంతు
అనాదిగా జరుగుతూనే వుంది

రాలలేని వుదయపు దిగులు
------------------------------------
1.
నా దేహంలో కనిపించని
దృశ్యమేదో గూడుకట్టుకుంటూ
యింకి పోతున్న ద్రవమేదో
దేహ పాతాళంలోకి విదృశ్యమౌతూ
వాయువేదో నిష్ప్రాణమౌతూ
2.
దేహ వృక్ష వసంతం కోసం
వేనవేల కణాలలో వర్షం
మేల్కొపు కోసం వుదయించి
రోజుల ప్రయత్నాల పూర్ణత సాధించో
రాలిపోయే వేసవి దుఖాన్ని భరిస్తో
3.
రుతువు రాని యీ దేహం కోసం
యెన్నిసార్లు కలిసిన పుట్టని ప్రాణం కోసం
వొందల రాత్రులు చీకటిని మోసి మోసి
మృత్యువును అసందిగ్ధంలోకి తోసి
నేలలోకి వొరిగిపోతూనే
4.
గడ్డకట్టలేని వేడి కోసం
యెన్ని నదులను పుట్టించిన
వాయువు ద్రవమూ కానిదేదో
తరుముతున్నట్టు ఫక్కున నవ్వే నవ్వై
నెత్తుర్లలను పలుచన చేసి
భూమ్యాకర్షణ నుంచి దూరం చేస్తోంది
5.
దుఖాన్ని దిగులును వీడి
మళ్ళీ మళ్ళీ మరో రుతువు కోసం
పులకించే విశ్వస్వప్నపు తీరంలో
నాలోని యుగాల మృత్యువేదో
వెలుగై కమ్ముకొని రక్షిస్తుంటుంది

యే సంవేదనో యిది
--------------------------
నీ గూడు నిర్మాణానికీ
పుల్లలెరిందెవరో

నీ ఆకాశ వీధులను
చూపిస్తున్నదెవరో

నీ రెక్కలకు ప్రాణం
పోస్తున్నదెవరో

నీవు వాలే రెమ్మను
సజీవంగా
వుంచుదున్నదెవరో

నీ కువకువలకు పాటలు
నేర్పిస్తున్నదెవరో


నీ దాహాన్ని తృప్తిగా
నింపుతున్నదెవరో

నీ కడుపును చల్లగా
వుంచుదున్నదెవరో

యీ భూమిని
కాపాడుతోంది యేదో

వో చెట్టు కూలింది
రెమ్మ విరిగింది
గూడు చెదిరింది
రెక్కలు ముక్కలై
గేయాలు గాయాలై
దాహాం ఆకలి తీరక
ప్రాణం శ్వాసించ లేక
కువకువలు దుఖపు గాత్రాలై
ముక్కలౌతున్న నేలలో
అన్నీ జారిపోతూ.......

నీ మానసపు చెదిరిన చిత్రాలు
పట్టుకొనలేని కలల ఛిద్రాలు
చెల్లాచెదురైన ఆశల శకలాలు
సుశోభించవు నీ కళ్ళల్లో

యే సమూహపు నినాదమో
యే నిర్లక్ష్యపు జీవితాల నడకో
వో రోజూ చేరలేని నీడల చీకట్లో
ద్రవించలేని గాయాలను రాజేస్తూ

నీలో
వో పక్షి యెగురేందుకూ
నీలో కరుణై కరిగి
వో గూడు కోసం పుల్లలను
నోట కరచి జోడుగా
వాల్తోందీ...నీ మానసంలో

ప్రాణాన్ని నింపే క్షణాలు
.................................
మా యింటికీ
రోజూ వచ్చే అతిధులు

పిచ్చుకలు
జీవ దాహంతో
ఆకలితో వాలును
మా గుండెలపై
మా సంక్షోభాల్ని
వాయిదా వేస్తాయి

వుదయాన మేల్కొల్పును
మమ్ము
తమ కువకువలతో...
ఆలస్యమైన అరపులాంటి
పిలుపు
యింటిపై నుంటే
చుట్టూ మూగును
యెగిరి గంతులేయును
అటుయిటు

మధ్యహ్నాన వేళ
యింట్లోకీ ప్రవేశించును
మా పరధ్యానాన్ని
బద్దలు చేయును

సాయంత్రం వీడ్కోలు
చెప్పేందుకొచ్చి
మాటల్లో పడి మరచిన
కిటికీ పై కూర్చొని
పలకరించును

తమ ఆతిధ్యాన్ని
స్వీకరించి చిత్తగించును
సంధ్యతో పాటు
వాటి కువకువల
రూప లావణ్యపు స్వేచ్చా
ధారణతో మేమూ నిద్రలొకి
జారుకొంటాం

సూర్యోదయపు
కువకువల ప్రతీక్షను
రెప్పలపై వుంచుకొని
మేమంతా పిచ్చుకలై
యెగురుతుంటాం
యిష్టమొచ్చినట్టు...
స్వప్నమై

కళ్లు తెరిచే సరికీ
మా పడకలపై
మాతో పాటు
కళ్ళు తెరుస్తూ...
పిచ్చుకలూ
కువకువలూ
వుదయాన్నే
దినదినమూనూ
















































































Recently written poems telugu by me























No comments: