Thursday, December 3, 2015

ఈనాటికవిత-48
__________________________
పఠాన్ మస్తాన్ ఖాన్ -గొంతు నులిమిన శ్వాస'
"ఆశాబద్ధతే జంతుః కర్మణా బహిచింతయః" ప్రాచీనుల మాట.ఆధునిక అర్థపరివర్తనలో,కవిత్వార్థంలో కల,స్వప్నం,ఆశ పర్యాయాలుగా కనిపిస్తాయి.పఠాన్ మస్తాన్ ఖాన్ కవిత-"గొంతు నులిమిన శ్వాస'లోని స్వప్నం కూడ ఆశనే సంకేతిస్తుంది.ఆశకూడా మానసికమైందే.
భౌతిక జీవితపు సంఘర్షణ,వాస్తవిక అధివాస్తవిక అనుకలనాలు ఈ కవితలో ఉన్నా.ఈ సృజన మానసికమైందే.మనోవైజ్ఞానికశాస్త్రంలో ఆలోచనాపవ్యవస్థ(Thought disorder)ఒకటి ఉంది.తనవ్యక్తిత్వాన్ని,సత్యాన్ని అర్థం చేసకునే స్థితి.ఇందులో వ్యక్తి వివేకం నిలబడి,సంసర్గాలు(భ్రాంతులు)సడలి నూతనసృష్టి జరుగుతుంది.ఈ కవితలో దీనికిపూర్వాపరాలనే ఖాన్ చిత్రించారు.
1.బతుకులో స్వప్నాలుంటాయి
స్వప్నాలకు యినుపరెక్కలొస్తాయి
యెగరలేక పోతుంటాను
అర్థ్రాంతరంగా...
మేల్కొంటాను
స్వప్నంలో నుంచి
జీవితంలోకి....
2.సత్యం
అర్ధాన్ని కోల్పోతుంది
చావు పుట్టుకలు
సంగమించినపుడు
కన్పించినట్టే కన్పించి
మాయమౌతుంటుంది
గుర్తుపట్టలేక పోతుంటాను.
అర్ధాంతరంగామెలుకోవటం ఈ ఆలోచనాపవ్యవస్థ ప్రభావమే.రెండవభాగంలో సత్యాన్నిగురించిన చర్చ ఉంది.ఇది "సత్యం అర్థాన్నికోల్పోవటం "ఈ భ్రాంతి తొలగటమే.యాకోబ్‌సన్(Roman,Jacobson)భాషయొక్క కార్యాలు కారకాలను గురించి చెబుతూ అధిభాష(Meta lingual)గురించి చెప్పాడు.జీవితం,బతుకు ఈరెండు పర్యాయాలుగానే కనిపించినా ఉపయోగంలో ఉండే కవిత్వార్థం(Poetic)రెంటిని వేరువేరు స్థాయిలనుంచి చెబుతుంది.జీవితం అపేక్షను,వాస్తవాన్ని స్పర్శిస్తే,బతుకు నిరపేక్షని,అనాసక్తిని చెబుతుంది.మొదటివాక్యంలో బతుకును నిర్వచించడానికి చేసిన ప్రయత్నం ఈ భావనను మోస్తుంది.
మనస్సుపై కోరిక చూపెట్టే రెండు ప్రతిఫలనాలు నాలుగవభాగంలో కనిపిస్తాయి.
మనస్సును
రంగుల మాస్క్ తో
మార్మికంగా
పలకరించినట్టు వుంటుంది
తన పదునైన గోర్లతో
పెకలిస్తున్నట్టు..
నేను
గాయమై స్రవిస్తున్నప్పుడు
నన్ను నేను నిశబ్దపు
లోయల్లోకి
జారవిడుచుకుంటూ....
సఘటనలు పరస్పరాధారితాలైనప్పుడు జరిగే వ్యవహారాలు ఇవి.మొదటిభాగం-రంగురంగుల్లో జీవితం ఎదురురావటం.రెండవభాగంలో వాస్తవంగా ఆలోచించినప్పుడు అవిబాధించడం కనిపిస్తాయి ఈ వాక్యాల్లో.దీనిని అపాతికత(Contingency)అంటారు.వాక్యాల్లో ఇనుపరెక్కలు-కూడా ఆశలోని భారాన్ని సూచిస్తాయి.
ఈ కవితలో ఆశావాదం(Optimism),వాస్తవం మధ్యజరిగే సంఘర్షణను చిత్ర్రించడం కనిపిస్తుంది.ఇలా మానసికంగా,భౌతికంగా జరిగే అన్ని విషయాలు గుర్తుండడం అనుషంగికస్మృతి(Incidental memory)అంతారు.ఇది అభ్యసనం ద్వారసాధిస్తారు.సాధారనంగా జరిగే అభ్యసనం ఇది.దీన్ని అనుషంగికాభ్యసనం(Incidental learning)అంటారు.
విష్యం చిన్నదేకాని.దాని చుట్టూ అల్లుకుని ఉన్న అంసాలు విస్తృతమైనవి.వస్తువుపై నిలబడటంపై ఖాన్ కు కొన్ని ఇబ్బందులున్నాయి.సంఖ్యాత్మకంగా వేసిన వుభాగం(numerical division)ఈ క్రమంలో కవి ఊహకు మేలు చేసింది.చాలా సార్లు వాక్యాలను లిఖితంగా ఇచ్చేప్పుడు పేర్చేపద్ధతి గురించి చెప్పుకున్నాం.వాక్యాలలోని పదాలమధ్య అర్థగతమైన సంలగ్న సంబంధం(Cohesive link)ఉంటుంది దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది.మనసికానుభవం కవితను ఒక కొత్త మార్గంలో ఎలానడిపిస్తుందో అర్థం చేసుకోడానికి ఈ కవితలో కొన్ని అంసాలు కనిపిస్తాయి.