Wednesday, January 13, 2016

తన్మయాత్మక వేదనాశకలపు సౌందర్య కవిత్వం - అరుణ్ బవేర యిలాంటి వో ప్రయాణం

  తన్మయాత్మక వేదనాశకలపు సౌందర్యాత్మక కవిత్వం - అరుణ్ బవేర యిలాంటి వో ప్రయాణం...

అరుణ్ బవేర వైయక్తికంగా ఆలోచనకూ ఆచరణకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఘాఢమైన పారదర్శక నిత్యనూతనానుభవాలతో జీవిస్తూ కవిత్వ సేద్యం చేస్తున్న హాలికవి. బవేర యిలాంటి వో ప్రయాణం జీవితం లాంటి సహజ,శ్రేష్టమైన మనిషి కోసం చేస్తున్న అన్వేషణ. యే వాద వివాదాలకు,కూటములకు,లాబియింగ్లకు అచ్ఛాదన యివ్వక,యివ్వలేక స్వచ్ఛమైన మానుషత్వంతో తన సొంత శైలిలో, అర్థ ధ్వనుల ప్రపాతంలో, మనుషుల్లో తడిని సృష్టిస్తూ,బాషా శిల్పాల జుగల్బందీలకు ఆవల వొకానొక పురాసంస్పందనతో స్వాభిమానసాధికారత కల్గిన యీ కవి నగ్నవుదయపు వొంటరి దుఖంలో తన లలిత రచనాకర్మను అన్ అకడమిక్ గా...విక్షుబ్దంగా మోహభంగుడై తన సంపూర్ణ తన్మయత్వంలో గంభీర స్వరాన్ని విన్పిస్తున్న కవి.
         బవేర ప్రాకృతిక జీవితాన్ని తవ్వే క్రమంలో పొందిన సంతోష దుఖాలను తన కవిత్వంలో అనువదించారు. మనకాన్షష్ను షూట్ చేసే కవిత్వం. మనల్ని తన అంతర్ముఖత్వంలోకి లాకెళ్ళే కవిత్వం బవేరది. Get drunk/stay drunk/on wine,virtue,poetry/what ever(బాదలేర్)లాంటి మాదకత,తన్మయత యితని కవిత్వంలో ......"నా సోగకళ్ళ సుడిలో రేగిన/చిట్టచివరి పరవశమా!
నీ చిగురుటాకు చెక్కిలిపై/ నా చెంగల్వ పూదండ" (కుంకుమ సాయంత్రాలు)

"సీతాకోకచిలుకై వచ్చి చేతివేళ్ళమీద వాలుతాయి/వచ్చి పోయే గాలుల్ని/ మురిపెంగా ముద్దాడినట్లు/జీవితం తడి ఆరని వెన్నెల(తడి ఆరని వెన్నెల)
 మహా కావ్యపంక్తుల్లా మరో కవిత రూప సారాల్ని విశ్లేషించించేదుకు వొక ప్రామాణిక నమూనలాంటి కవితాఝరి యిలాంటి వో ప్రయాణం. యితని కవిత్వం చదువుతుంటే మనలో మూల్యాంకన నిర్మాణప్రక్రియ దానంతటదే ప్రారంభమౌతోంది. యితని కవిత్వం epitom of poetry లా వున్నత సౌందర్య విలువలతో, కవిత్వ గుణ సార్వభౌమత్వంతో నిలిచిపోతున్న కవిత్వమిది.
                యితని కవిత్వం అసహజతల్ని,కృతిమతల్ని ఆవల తరిమి సహజసొబగుల గుభాళింపులతో సమ్మోహన పరచి ముగ్ధతను సాధించి సేదతీరుతున్నట్టే వున్నా ...... మరో జీవన సౌందర్యదాహం అతన్ని వెంటాడి కవిని కాదు..కాదు...
మనిషిని చేస్తూ మరో కవితాధారై ప్రవహిస్తుంటుంది యిలా...యెంతటి స్పష్టమైన అవధారణలు...తనలోని సౌందర్యావిష్కరణ నిమిత్తం తన ప్రయనించే క్రమంలోని ఘర్షణ వొక యుద్ధ సమానం....'కొన్ని వీరోచిత క్షణాల్లో ' బతుకు పట్ల తన సన్నధతను ప్రకటిస్తాడిలా - 'బ్రతకడం వొక అపరిత విశ్వాసం/మరికొన్ని వీరోచిత క్షణాలు...' యింకా యిందులోనే సరైన కలకోసం వేల రాత్రులు నిద్రపోయే తపన, మానవ సంబధాల పట్ల వొక pure effort ...existed disorders పట్ల నిశ్చేష్టతతో కూడిన 'ఖాళీతనంతో యేం మాట్లాడుతాం'....దేనిమీద యే రకమైన రుచిలేనితనపు సంవేదనాహీన సమూహాల పట్ల చింత 'కొన్ని వీరోచిత క్షణాలు' కన్పిస్తుంది. యిందులోనే వొక అంతర్ సంక్షోభంలో సహజాతవసరపు తక్షణ అవసరాన్ని గుర్తించి తన survival ప్రాధాన్యతను "యిక ఆకలి గురించి తప్ప/ప్రేమ గురించి మాట్లాడుకోలేని సంధర్భం"అంటాడు ...వర్తమానం నిరంతరమయ్యే సమూహపు విచ్ఛిన్నత సృష్టించిన హింస పట్ల వ్యక్తమయ్యే బాధ సుష్పష్ట దృశ్యపు ప్రయోగాత్మక ముక్క యిలా - " మన మాటలు మన గొంతుల కిందే తగలబడుతున్నాయి/కొత్తగా మనం భయాల్ని శ్వాసిస్తున్నాం/గాయాలకి దేహం యిచ్చాం." మన జీవితం యే స్థితికి చేరుకుందంటే -"యిప్పుడు జీవించడానికి / ప్రేమించడానికి / వొక యుద్ధం అనివార్యమైందనే"వర్తమాన జీవన వాస్తవికత యితని కవిత్వంలో...
   వొక జ్ఞాపకపు శకలం నుంచి ప్రారంభమైన బాధ ...తన ఆత్మ స్వేచ్ఛా ప్రపంచంలోకి పయనించి ...ఆనందక్షణాల్లో తేలియాడి తిరిగి దైనందిన జీవితంలోకి వొక రాతిరి నుంచి మరో పగట్లోకి అంతమయ్యే అంతమయ్యే వొక సాదృశ్యాత్మక కవిత - ప్రియురాలి బుగ్గల్లో సిగ్గులు చేసుకునే ఉత్సవం. యీ కవితలో బాల్యంలో చూసిన వో దృశ్యం - 'ఏటి ఒడ్డున ఏతం తోడిన నీటిలో /స్నానిస్తున్న పిట్టల్లాగ '. మధ్యలో - 'చెట్లెక్కి గాలిలా ఆకుల్లో దూరి/ నవ్వుకొని మురిసిపోయే క్షణాల్లో'కవి వుపశమనాన్ని పొందుతూ,రాతిరి సౌందర్యాన్ని దర్శించే అంతఃచైతన్య ఝరి నుంచి సామాన్య సృహ లోకి పయనించే కవితాత్మకత చివర్లో ఆకట్టుకొంటోంది - 'పునః పునః విఫలమైన క్షణాల్లో/ మిగిలే ఒక భారమైన నిరీక్షణ.'
                    జీవితం పట్ల కవికున్న స్పష్టత కింది పంక్తుల్లో ప్రస్పుటతమౌతుంది - 'జీవితం నిర్వచన స్థాయి నుంచి ఎదగలేదని/జీవితం విస్మయంగా మొదలై/విలోమంగా గడచి,విచారంగా ముగుస్తుందని/మధ్య మధ్యలో సంతోషం గడ్డి పువ్వై పూస్తుందని చెప్పడం ఘాఢమైన అనుభూతి కల్గిన బవేరాకే సాధ్యమైంది. రెండు పొడివేళ్ళ మధ్య వొక తడి సంతకం అనే కవిత మార్మక అర్థంలో లిఖింపబడింది...చాలా సింపుల్గా వుండే నిర్మాణంలో గొప్ప టెక్నిక్తో లిఖించుకు పోయిన కవితలు చాలా వున్నాయి - 'రోజు ధైర్యంగా తాకే భయం/రాత్రంతా నదిలో యీదిన చంద్రుడు/తెల్లారేసరికి జాలరి వలలో చిక్కాడు'.
                        మనిషి మనిషిగా మారేందుకు ప్రకృతి సిద్ధ గుణాలు వుండనే వున్నాయి దాని నుంచి గ్రహించే ధ్యాన మగ్నతను మనిషి కోల్పోతున్నాడూ. కవి దయామయ విశ్వప్రాకృతికత లోకి పయనించి మైత్రిని సాధిస్తాడిలా 'ఒక అనంతయాత్ర'లో - 'నా చుట్టూ విశ్వం/పరమ దయాత్మకంగా పోగిపడుతుంది/ళిత లావణ్యంగా/మనసు పొరల్లోకి యింకుతూ../యుగాల మైత్రిగా /స్నేహంగా ఉదయించింది.'
          అనంతంగా సాగే యీ కాల గమనంలో మనమూ వొక క్షణకాల పాత్రధారులం కాదా.....ప్రకృతి ముందు మనం వొక చిన్న కణంలాంటి వారం కాదా....వొక వర్టికల్ మనిషిని నిలువుగా  చీల్చే అహంకారపు పరిమిత పరిధిని గ్రహించిన కవి కవిత చివర్లో ఆనంద వినయంతో ప్రకృతి ముందు మోకరిల్లిన కృతజ్ఞతా ప్రకటన యిలా - ' ప్రకృతికెదురుగా / ఓడిపోతూ/నిట్టనిలువుగా చీలిపోవడం/ఒక మహాదానంద సందర్భం'.
                 యిలాంటి వో ప్రయాణం లోని కవితలు కవి తన ఆత్మతో చేసిన సంభాషణలు...యివి కలలై, ఆ కలలు వర్షంలో తడిచి ముద్దయి, వెంటాడి, నిద్దట్లోంచి రాలి,పక్షులు పొడుచుకు తినే'లాంటి భిన్న సంధర్భోచిత ప్రయోగాలు ఆకట్టుకుంటాయి.
యింకా పూలభాష తెలసిన సీతాకోకచిలుకలతో మాట్లాడడం, పక్షిలా నిద్రలేవడం, ఇంద్రధనస్సు తో పొలాలు మాట్లాడడం...ఆత్మల్లో యింకే వర్షం...ప్రేమను మైకంగా అనుభవించే దాహంలో కవిత్వం నిండుగా కన్పించి మనలో సెలయేరై రాలి నదిలా మారి ముగింపునకు చేరువయ్యే కొద్ది మనలో ప్రవహించే యీ బతికే క్షణాల అభివ్యక్తి ప్రేమమయమై మనుషుల్ని చేస్తోంది.